ఇంటర్నెట్ డెస్క్: వర్ధమాన గాయని ప్రవస్తి (Pravasti) చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిపై ప్రముఖ గాయని సునీత (Sunitha) స్పందించారు. ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అన్ని విషయాలు తనకు ఆపాదించుకుని ఆమె ఫీలవుతోందని పేర్కొన్నారు.
‘‘ప్రవస్తి.. నిన్ను బాల్యంలో నేనూ ముద్దుచేశా. ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా! ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతుంటాం. ఆయా ఎపిసోడ్స్ నువ్వు చూడలేదనుకుంటా. మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా..! ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా? మ్యూజిక్ విషయంలో ఛానల్స్‌కు కొన్ని పరిమితులుంటాయి. కాబట్టి అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదు. రైట్స్ ఉన్నవి మాత్రమే పోటీలో పాడాలి. ఆడియన్స్‌కు ఇలా అన్ని విషయాలు చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా’’ అని అన్నారు.
‘‘ప్రతి విషయానికీ నువ్వు అప్‌సెట్ అయిపోతావు. అమ్మ స్థానంలో నేను అర్థం చేసుకోగలను. వేరే వారిని నేను ఇష్టపడుతున్నా అంటున్నావు. మరి, నువ్వు తప్ప వేరే ఎవరూ నాతో కలిసి ఆల్బమ్‌కు పాడలేదు. ఆ వీడియో కోసం నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నా? ఇవన్నీ మర్చిపోవడం తప్పు కదా. పెళ్లి వేడుకల్లో నేనూ పాడుతుంటా. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడైన అనిరుధ్.. ఒకప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్‌లో పాడారు. మీ అమ్మగారిని ‘నువ్వు’ అనడం నిన్ను బాధించిందని, అది సంస్కారం కాదని అన్నావ్. ఎలిమినేషన్ రోజు మీ అమ్మగారు నన్ను ఉద్దేశించి మాట్లాడడం నీకు కరెక్ట్ అనిపించిందా’’
‘‘నువ్వు చెప్పివన్నీ అబద్ధాలే అని రుజువు చేసే అవకాశం లేకపోలేదు. ఓటమిని అంగీకరించలేని బాధలో ఉన్నావు కాబట్టి తర్వాత చర్చించాలనుకుంటున్నా. ఎవరైనా ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నేనూ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా. ఓటమిని అంగీకరించలేకపోతే నేర్చుకునేందుకు స్కోప్ ఉండదు. సీనియర్స్‌పై గౌరవం ఉండాలి. సినిమాల్లో మేము పాడిన పాటలను తీసేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాగని మేము నీలా బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు’’ అని ప్రవస్తిని ఉద్దేశించి చెప్పారు.
జనరేషన్ డేంజర్‌లో..
‘‘ఈతరం తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం మానేసి అతిగా స్పందిస్తున్నారు. గెలిస్తే ఒకలా, ఓడిపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు. ఇది జనరేషన్‌ను డేంజర్‌లో పడేసే పరిస్థితి. ‘నీకు తెలిసింది తక్కువ. తెలుసుకోవాల్సింది చాలా ఉంది’ అని పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.