24akp1 d9b7faeda1 v jpg.webp.webp

బోగస్‌ పింఛన్‌ల ఏరివేత | Collection of bogus pensions


గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్టు ఫిర్యాదులు

తొలుత దివ్యాంగులు, వ్యాఽధి బాధితుల పింఛన్లపై దృష్టి

వైద్య బృందాలతో ఇంటింటీకి వెళుతున్న డీఆర్‌డీఏ అధికారులు

ఇప్పటికే పలు మండలాల్లో అనర్హులు గుర్తింపు

తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యులపైనా చర్యలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో బోగస్‌ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనర్హులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు గతంలోనే ఆదేశాలు అందాయి. దివ్యాంగ పింఛన్ల తనిఖీలు పూర్తయ్యే వరకు కొత్తగా దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జనవరి నుంచి సదరం క్యాంపుల ఏర్పాటు, ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేశారు.

గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు మాత్రమే ఇవ్వగా, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా రెట్టింపు.. రూ.6 వేలకు పెంచింది. అలాగే పక్షవాతంతో వీల్‌చైర్‌ లేదా మంచానికే పరిమితమైన వారు, తీవ్రవైన కండరాల బలహీనతతో బాధపడుతున్న వారు, కుష్ఠువ్యాధిగ్రస్థులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి, ఇంకా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి గత ప్రభుత్వం నెలకు రూ.10 వేలు పింఛన్‌గా ఇవ్వగా, కూటమి ప్రభుత్వం దీనిని రూ.15 వేలకు పెంచింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి పలువురు అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్‌ (పునఃపరిశీలన) చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీంతో డీఆర్‌డీఏ అధికారులు బోగస్‌ పింఛన్‌ల ఏరివేతకు రంగంలో దిగారు. దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారు జిల్లాలో 30,845 మంది, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు పింఛన్లు పొందుతున్న వారు 601 మంది వున్నారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన పింఛన్‌దారుల వివరాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వున్న వ్యక్తులను ప్రత్యేక వైద్య బృందాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల్లో 60 మంది వరకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా పింఛన్‌ డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. ఇదే తరహాలో దివ్యాంగ పింఛన్‌దారుల్లో అనర్హులను గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియను నెలాఖరునాటికి పూర్తి చేసి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్‌) ముఖ్య కార్యనిర్వాహణాధికారికి నివేదిక అందజేయనున్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు అంగవైకల్య సర్టిఫికెట్లు (సదరం) జారీ చేసిన వైద్యులను గుర్తించి, వారిపై కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న జిల్లాస్థాయి పింఛన్‌ వెరిఫికేషన్‌ సమన్వయ కమిటీ చర్యలు తీసుకుంటుంది.

Updated Date – Apr 25 , 2025 | 12:49 AM

Shopping Cart
Scroll to Top